కాంగ్రెస్‌ కూటమితోనే ప్రాంతీయ పార్టీల పటిష్టత

రాహుల్‌ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటే ఆపేదెవరు?

తేజస్వీ యాదవ్‌ వెల్లడి

పట్నా,జూన్‌4(జ‌నం సాక్షి ): రాబోయే 2019 లోక్‌ సభ ఎన్నికల్లో రాహుల్‌ ప్రధాని కావాలనుకోవడంలో ఎంతమాత్రం తప్పులేదని రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్‌జేడీ)నేత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ అభిప్రాయ పడ్డారు. రాహుల్‌ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటే ఆయనని ఎవరూ ఆపలేరన్నారు. దీనిపై తేజస్వి మాట్లాడుడూ..’ ఎవరికి ఏ పదవి దక్కాలో నిర్ణయించేది ప్రజలు. వాళ్లే కావాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ ఎందుకు ప్రధాని కాకూడదు?. ప్రజల ఆగ్రహానికి గురికానన్ని రోజులూ రాజకీయ నాయకులు, పార్టీల మనుగడ ఉంటుంది. ఎప్పుడైతే నాయకుల పాలనపై ప్రజలకు విసుగొస్తుందో వెంటనే వారిని గద్దె దించేస్తారు. దానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అని అన్నారు. మూడో కూటమి ప్రభుత్వాలు ఇంతకు ముందు నిలబడలేదేమో..ఇకముందు అవి విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు మూడో కూటమి ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ లేదు కాబట్టే అవి మనుగడ సాగించలేకపోయాయి. ఎప్పుడైతే కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ఏర్పడిందో అప్పటినుంచి వరుసగా పదేళ్లు అధికారంలో నిలిచింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపై వచ్చి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తే కచ్చితంగా దేశానికి మంచి రోజులొస్తాయి. అన్ని పార్టీ తమతమ ఇగోలు పక్కన పెట్టి ఏకతాటిపై నిలబడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.’ అని తెలిపారు. తన తండ్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో ఉన్నా పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని విజయవంతంగా తేజస్వీ నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ‘గెలవడానికి ఎవరేం చేయగలరో అన్నీ చేసుకోండి చివరికి గెలిచేది మాత్రం మేమే’ అంటూ ధైర్యంగా సవాల్‌ విసిరి మే నెలలో జోకీహాట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపపోరులో తన అభ్యర్థిని 40వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు.

—————–