కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో..  ఉద్యమకారుల ఆత్మఘోషిస్తుంది


– కాళేశ్వరం పనులు ఆపాలంటూ బాబు లేఖలురాశాడు
– నోటికాడ బుక్కను బాబు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నాడు
– కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రజలకు కన్నీళ్లే మిగిల్చారు
– ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు
నిజామాబాద్‌, డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ) : టీటీడీపీ అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాదని, తెలంగాణ ద్రోహుల పార్టీ అని మంత్రి హరీష్‌ రావు అభివర్ణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు ఇచ్చిందని, వీరి హాయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ని
నమ్మవద్దని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారిలో హరీష్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూనే టీటీడీపీ, బాబుపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం పనులు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాయడం వల్ల గాంధారి, ఎల్లారెడ్డిలకు నీళ్లు రావని వివరించారు. మొత్తంగా నోటి కాడ బుక్క కొట్టడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  తెలంగాణ వద్దన్న టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ ఘోషించదా అంటూ ప్రశ్నించారు. ఈ పొత్తులను సమర్థిస్తామా ? అని ఓటర్లనుద్దేశించి పేర్కొన్నారు. జై తెలంగాణ అని అసెంబ్లీలో అంటే ఆ ఎమ్యెల్యేలను బయటకు పంపించారని హరీష్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ అనే పదాన్ని బ్యాన్‌ చేసిన వ్యక్తి బాబు అంటూ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో విత్తనం, ఎరువు, పెట్టబడి సహాయం, 24గంటల కరెంటు రావడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తయ్యాయని, వచ్చే రెండు సంవత్సరాల్లో గాంధారీకి నీళ్లు తెస్తామన్నారు. ఈ పనులు కాంగ్రెస్‌ వాళ్లతో అయితదా అని ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. రైతన్న కడుపు నిండాలంటే కారును, కేసీఆర్‌ను తీసుకరావాలి అంటూ హరీష్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎనుగు రవీందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హరీష్‌రావు కోరారు.