కాంగ్రెస్‌ దయ వల్లే సీఎం అయ్యాను

– కర్ణాటకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన బాధ్యత
– కర్ణాటక సీఎం కుమారస్వామి
న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీ దయవల్లే తాను సీఎం అయినట్లు కుమారస్వామి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..  సీఎంగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఆయన అన్నారు. కానీ ఏది చేయాలన్నా.. కాంగ్రెస్‌ నేతల అనుమతి తీసుకోవాలని, వాళ్ల పర్మిషన్‌ లేకుండా ఏవిూ చేయలేమని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే తాను సీఎం అయినట్లు కుమారస్వామి అన్నారు. ఎవరికి ఏ మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పజెప్పాలనే విషయంపై మాకింకా స్పష్టత లేదని, దీనిపై పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ నేతలతో చర్చిస్తామన్నారు. ఇరు పార్టీలకూ న్యాయం చేకూరేలా పదవుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజలు జేడీ(ఎస్‌)ను వద్దనుకుంటున్నట్లున్నారని, అందుకే ఎన్నికల ఫలితాల్లో మా పార్టీకి సరైన మెజార్టీ రాలేదన్నారు. కానీ, ఈసారి ఫలితాలు మారుతాయి. 6.5కోట్ల కర్ణాటక రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకుంటామన్నారు. ఇకపై కొత్త కుమారస్వామిని చూస్తారన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేరుస్తామని, ఒకవేళ హావిూల అమలులో వైఫల్యం చెందినా, ప్రజల్లో నా పాలన పట్ల అసంతృప్తి ఏర్పడినా వెంటనే రాజీనామా చేస్తానని, రైతుల రుణమాఫీతో మా హావిూల అమలు మొదలువుతుందన్నారు. రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని భాజపా బెదిరించింది. ఆ అవకాశం భాజపాకు ఇవ్వం. అలాంటి బెదిరింపులకు భయపడం. సంకీర్ణ ప్రభుత్వం కావడంతోనే కాంగ్రెస్‌తో చర్చించనిదే ఏ నిర్ణయం తీసుకోం’ అని తెలిపారు.