కాంగ్రెస్‌ నాయకులకు ఏనాడూ అభివృద్ది పట్టదు

వారి హయాంలోనే తెలంగాణ వెనకబాటు: పైళ్ల

యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంపాదించుకోవడానికి కృషిచేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిందేవిూ లేదని భువనగిరి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నీరు తాగి ప్రజలు జీవనమరణాలతో పోరాడారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయానికి, తాగునీటిని అందించారని తెలిపారు. జలవనరులు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ అని, మన రాష్ట్రం, మన పార్టీ అనే నినాదంతో ముందుకెళ్లి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మహాకూటమి అధికారం కోసమే పొత్తులు పెట్టుకుంది, మహాకూటమి మాయాకూటమి అని, కూటమికి ఓటేస్తే రాష్ట్రం వెనుకబాటు తనానికి గురవుతుందని, కూటమికి ఓటేసిన వారు దీనికి కారకులవుతారని పేర్కొన్నారు. సీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఉమ్మడి రాష్ట్రంతో తెలంగాణ వెనుకబాటు తనానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ లేదని, మహాకూటమిలో ముఖ్యమంత్రి అయ్యేవారు ఎవరో దేవుడికే తెలుసని, సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారని, ఇప్పుడే ఇట్లుంటే భవిష్యత్‌లో వీరు కలిసుండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న భూరికార్డులను ప్రక్షాళన గావించి రైతులకు నూతన డిజిటల్‌ పాస్‌పుస్తకాలతో పాటుగా, సేద్యానికి ఎకరాకు రూ.8 వేలు చొప్పున అందించడంతో పాటు, రూ.5 లక్షలు రైతుబీమా పథకంతో రైతులకు భరోసాగా నిలిచారన్నారు. ఐక్యరాజ్యసమితిలో రైతుబంధు పథకానికి గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు గర్వించే విధంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.