కాంగ్రెస్ భవన్ ఎదుట ఉద్రిక్తత
నిజామాబాద్, జనవరి 30 (): రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి పాల్పడుతున్న పిడిఎస్‌యు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సోనియా, రాహుల్‌గాంధీలకు వ్యతిరేకంగా నగర పిడిఎసీయు విద్యార్థులు నగరంలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ శవయాత్రను నిర్వహించారు. శవయాత్ర రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ప్రారంభమై కలీల్‌వాడి, తిలక్‌గార్డెన్ రైల్వేస్టేషన్ మీదుగా కాంగ్రెస్ భవన్ వద్దకు చేరుకుంది. దిష్టిబొమ్మ దగ్ధానికి పాల్పడుతుండగా కాంగ్రెస్ భవన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. పిడిఎస్‌యు నగర ప్రధాన కార్యదర్శి కల్పనపై ఓ పోలీసు చేయి చేసుకోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు ఆ పోలీసుపై దాడికి దిగారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించని పాలకులెందరో మట్టికరిచారని ఆయన అన్నారు. సీమాంధ్రపెట్టుబడిదారుల నోట్ల కట్టలకు లొంగిపోయి వాయిదా కుట్రలు చేస్తోందని, సోనియా, రాహుల్‌లే తెలంగాణ శత్రువులని అన్నారు. పిడిఎస్‌యు జిల్లా నాయకురాలు ప్రగతి, నగర ఉపాధ్యక్షులు సుజిత్‌కుమార్, తదితరులున్నారు.