కాంగ్రెస్ మహాధర్నాకు షరతులతో అనుమతి
హైదరాబాద్,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు రోజులు వివిధ పార్టీలతో, ప్రజా సంఘాలతో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక అంశాలపై మహాధర్నా నిర్వహిచాలని నిర్ణయించింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద మహాధర్న నిర్వహణకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా నిర్వహణకు అనుమతి ఇచ్చిన పోలీసులు 17 షరతులు విధించారు. 200 మందికి మించకుండా ధర్నాలో పాల్గొనాలని.. ప్రేరేపిత నినాదాలు ఇవ్వడం, వ్యాఖ్యలు చేయరాదని అనుమతి పత్రంలో సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డిలతో పాటు పలు పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.