కాంగ్రెస్ స‌భ‌ పై ట్వీటర్ లో మంత్రి కేటీఆర్ ధ్వ‌జం

హైదరాబాద్ జనం సాక్షి :

ఈ  నెల 26వ తేదీన చేవేళ్ల వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అది డిక్ల‌రేష‌న్ స‌భ కాదు.. కాంగ్రెస్ ఫ్ర‌స్ట్రేష‌న్ స‌భ అని కేటీఆర్ విమ‌ర్శించారు.

క‌ర్ణాట‌క‌లో క‌నీసం రేష‌న్ ఇవ్వ‌లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు వ‌చ్చి డిక్ల‌రేష‌న్ ఇస్తే న‌మ్మేదెవ‌రు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. చైత‌న్యానికి ప్ర‌తీకైన తెలంగాణ ప్ర‌జ‌లు.. ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ పేరిట విజ‌న్ లేని కాంగ్రెస్‌.. డ‌జ‌న్ హామీలు ఇచ్చినా వాటిని ఎవ‌రూ న‌మ్మ‌రు అని స్ప‌ష్టం చేశారు. ఆ హామీల‌న్ని గాలిలో దీపాలే అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చిన 75ఏండ్ల త‌ర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనుక‌బ‌డి ఉన్నారంటే.. అందుకు కార‌ణం కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లో.. క్రెడిబిలిటీ లేదు అని కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠం అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.