కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విజయవాడ,జూలై6(జనం సాక్షి): సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపు జరగాలని ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ 151 జీవోను రాష్ట్రప్రభుత్వం జారీ చేసిందని, ఎస్‌ఎస్‌ఎలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీనిని వర్తింప చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల మంది ఎస్‌ఎస్‌ఎలో వివిధ విభాగాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని వివరించారు. కొన్ని విభాగాల ఉద్యోగులకు పిఎబి అనుమతి ప్రకారం వేతనాలు పెంచాల్సి ఉన్నా ఇప్పటివరకు పెంచలేదన్నారు. పిఎబి అనుమతి లేని కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా జీవో 151ను వర్తింపచేయాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలని, ప్రభుత్వ ఉన్నతాధికారులకు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం శూన్యమని ఆందోళన వ్యక్తం చేశారు.