‘కాగ్‌’గా శశికాంత్‌ నియామకం

సుప్రీంలో అభ్యంతరం
న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) :
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా శశికాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1976 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌కు చెందిన 61 ఏళ్ల శశికాంత్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కాగ్‌గా నియమించింది. ఐదున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని బుధవారం పదవీ విరమణ చేసిన వినోద్‌రాయ్‌ స్థానంలో శశికాంత్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2017 సెప్టెంబర్‌ 24 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. శశికాంత్‌ ఇంతకుముందు రక్షణ శాఖ కార్యదర్శిగా పని చేశారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేసిన ఆయన దాదాపు పదేళ్ల పాటు రక్షణ శాఖలో వివిధ ¬దాల్లో పని చేశారు. వినోద్‌రాయ్‌ వలే శశికాంత్‌ కూడా ఆర్థిక శాఖలో కొంతకాలం పాటు పని చేశారు. శశికాంత్‌ నియామకంపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీజేపీ తీవ్రంగా తప్పుబట్టగా, ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇప్పటివరకు కాగ్‌గా వ్యవహరించిన వినోద్‌రాయ్‌ చాలా నిబద్దతతో పని చేసి, ప్రభుత్వ లొసుగులను బయటపెట్టారు. 2జీ స్పెక్ట్రమ్‌, కోల్‌గేట్‌లాంటి సంచలన కుంభకోణాలను వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గకుండా పని చేశారు. దీంతో కాగ్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన తొణకలేదు. ప్రభుత్వం కాగ్‌ను కేవలం అకౌంటెంట్‌గా చూడాలనుకుంటోందని ఒకానొక సందర్భంలో ఆయన విమర్శించారు.
నూతన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్‌ శర్మను ప్రభుత్వం కాగ్‌గా నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, శర్మపై రక్షణ శాఖలో పలు అభియోగాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని యూపీఏ ప్రభుత్వం ఆయనను కాగ్‌గా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ జూలైలో విచారణకు రానుంది.కంప్టోల్రం అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శశికాంత్‌ను నియమించడంపై ఇప్పటికే బీజేపీ మండిపడుతోంది. ఆయన నియామకం వ్యక్తిగతంగానే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌ జైట్లీ విమర్శించారు. రక్షణ బడ్జెట్‌ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన శశికాంత్‌ తనపై తాను మదింపులు జరపగలడా? ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు.