కారును ఢీకొనే దమ్ము కూటమికి లేదు
ఎవరు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య
జనగామ,నవంబర్24(జనంసాక్షి): ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమిని చిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహా కూటమి దొంగల కూటమి అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కారు.. కేసీఆర్.. సర్కార్ అనే నినాదంతో తనను దీవించాలని ఆయన ప్రజలను కోరారు. శనివారం నాడిక్కడ ప్రచారంలో భాగంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయంటే వివిధ పార్టీల నుంచి కొత్త వ్యక్తులు పుట్టుకొస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే గ్రామాల్లో మూడు విడతల్లో ప్రచారం చేసినట్లు ఆయన వివరించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశానన్నారు. దీంతో ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ వస్తున్నదని డాక్టర్ రాజయ్య అన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చని సంక్షేమ పథకాలను సైతం అమలు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోనే అభివృద్ధి పరంగా రాష్ట్రం ఎంతో ముందుందన్నారు. కేంద్ర మంత్రులు సైతం కేసీఆర్‌ను అభినందించిన
విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని వివరించారు. తెలంగాణలో త్యాగాలు చేసిన చరిత్ర ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. కేవలం ఎన్నికల్లో గెలువడం కోసమే బద్ధ శత్రవులైన పార్టీలు సైతం మహా కూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల నిధులతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలతో అభివృద్ధి చేశానన్నారు. కూటములు ఎన్ని వచ్చినా కారును ఢీకొట్టలేవని డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. కేసీఆర్‌ను మరోసారి సీఎంగా తెలంగాణ ప్రజలు గెలిపించి తీరుతారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అందించామన్నారు.