కారు టైరు పంక్చర్‌ కావడంతో ప్రమాదం

భార్యాభర్తల మృతి

కడప,జూన్‌28(జ‌నం సాక్షి): కడప నగర శివారులోని టోల్‌గేట్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన మస్తాన్‌రావు బెంగళూరులో చికిత్స చేయించేందుకు భార్య భాగ్యలక్ష్మి, బంధువులు సహా మొత్తం ఐదుగురు కారులో బయలుదేరారు. కడప సవిూపంలోని టోల్‌గేట్‌ వద్దకు రాగానే కారు టైరు పంక్చర్‌ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న మస్తాన్‌రావు, అతని భార్య భాగ్యలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. సురేష్‌, ప్రసాద్‌తో పాటు కారు డ్రైవర్‌ బాలరాజుకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పట్టుబడిన మహిళాదొంగలు

జంపేట పట్టణంలోని బండ్రాళ్లవీధిలో ఉన్న బాబు బంగారు దుకాణంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు మహిళలు హస్తలాఘవం చూపి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇద్దరు మహిళలు తమ వద్ద ఉన్న గిల్టు కమ్మలను బంగారు దుకాణంలో అమ్మడానికి ప్రయత్నించారు. అవి నకిలీవని చెప్పడంతో వెండి గొలుసులు కావాలని అడిగారు. దుకాణదారుడు వాటిని చూపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నాలుగు జతల గొలుసులను నేర్పుగా తమ సంచిలో వేసుకొన్నారు. అనంతరం తమకు నచ్చలేదని బయటకు వెళ్లారు. ఇదే సమయంలో చోరీ జరిగిన సంగతి గుర్తించిన దుకాణదారు కేకలు వేస్తూ వారిని వెంబడించారు. పాతబస్టాండు సవిూపంలో పరిగెత్తుతున్న ఓ మహిళను పోలీసుల సహాయంతో పట్టుకొన్నారు. అనంతరం మరో మహిళ ధరించిన దుస్తుల ఆనవాళ్ల ప్రకారం పోలీసులు రైల్వేస్టేషన్‌ సవిూపంలో అదుపులోకి తీసుకొన్నారు. ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు.