కార్యకర్తలకు మనోధైర్యం కల్పించండి
కడప, జూలై 21 : ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డికార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని ఒంటిమిట్ట మండల నాయకులు ధ్వజమెత్తారు. ఒంటిమిట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలలో కొత్త అభ్యర్థులు పోటీ చేయడం , ఎన్నికల అనంతరం కనిపించకుండా పోవడం జరుగుతోందని, దీని వల్ల నిజమైన కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఓటమి సహజమేనని, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడం, ఫలితాల అనంతరం అతను ఈ మండలంలోని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, వారి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మంత్రి సి. రామచంద్రయ్య, , రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌ను కాని నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించాలని వారు పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే పార్టీలో ఏ ఒక్క కార్యకర్త మిగలరన్న విషయాన్ని పెద్దలు గుర్తించాలన్నారు.