కార్యకర్తలతో మేథోమథనం జరపాలని
గాంధీ భవన్ వద్ద నేడు వీహెచ్ మౌనదీక్ష
హైదరాబాద్, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త మయ్యారు. ఆయన శనివారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ వద్ద మౌన దీక్ష చేయనున్నారు. ఉదయం పదన్నర గంటలకు గాంధీభవన్ వద్ద మౌనవ్రతం ప్రారంభిస్తానని ఆయన శుక్రవారం మీడియా పత్రినిధులతో చెప్పారు. తమ తరఫున విహెచ్ మాట్లాడు తున్నారని, తమకు అండగా ఉంటాడని ఆనుకో వాలని ఆయన అన్నారు. కార్యక్రమలతో మేథో మథనం జరపాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టనున్నారు. కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకోవడానికి కార్యకర్తలతో మేథోమథన సదస్సు నిర్వహించాలని ఆయన నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తన మాటను పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో ఆయన మౌనదీక్షకు దిగుతున్నారు. పార్టీలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. తన మాటలనే పట్టించుకోవడం లేదంటే కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎఐసిసి కార్యదర్శిగా ఉన్న తనకే దిక్కులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి సిఫార్సు చేయడానికి వేసిన మంత్రుల కమిటీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. మంత్రుల కమిటీ అసలు విషయమే మారిపోయిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ అవినీతిని మంత్రుల కమిటీ ప్రస్తావించలేదని, జగన్ అవినీతిని ప్రశ్నించకుండా పార్టీని బలోపేతం చేయలేమని ఆయన అన్నారు. వై.ఎస్ జగన్ అవినీతిని మంత్రుల కమిటీ ఎందుకు పట్టించుకోలేదని ఆయన అడిగారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా ఏం చేసినా ఫలితం ఉండదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోను తీసేయాలని ఆయన కోరారు. పదవులను నిజమైన పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలని ఆయన అన్నారు. తమకు భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. అవినీతి మంత్రుల వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన అన్నారు.