‘కాలా’కు సుప్రీంకోర్టులో ఊరట

సినిమా నిషేధించాలన్న పిటీషన్‌ను తిరస్కరణ
న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కర్ణాటకలో సినిమాను నిషేధించడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కావేరీ వివాదం నేపథ్యంలో ‘కాలా’ విడుదల వాయిదా వేయాల్సిందిగా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో కర్ణాటకలో ‘కాలా’ విడుదలకు రూట్‌ క్లియరైంది. కావేరీ నదీ జాలాల విషయమై రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు సినిమా విడుదలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. సినిమాను విడుదల కానివ్వమంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ప్రకటించింది. దాంతో సినిమా నిర్మాతలు ధనుష్‌, సౌందర్య రజనీకాంత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు ‘కాలా’ సినిమాను వాయిదా వేయాల్సిందిగా సుప్రీంలో పిటిషన్‌ వేశారు. కానీ ఇందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. కర్ణాటకలో థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని రజనీ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామిని కోరారు. కాలా’ సినిమాకు పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకు జోడీగా ఈశ్వరిరావు, హుమా ఖురేషీ నటించారు. బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.