‘కాలా’ను కర్ణాటకలో రిలీజ్‌ చేయకండి

 కన్నడ సీఎం కుమారస్వామి సూచన

బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా మూవీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాపీరైట్‌ కేసులు.. మరోవైపు కావేరీ వివాదాలు. ఇప్పటికే ఈ సినిమాను కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ కానివ్వబోమని కన్నడ ప్రజలు తీర్మానించేశారు. కర్ణాటక హైకోర్టు మాత్రం సినిమా రిలీజ్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని, థియేటర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టంచేసింది. ఆ మరుసటి రోజే కర్ణాటక సీఎం కుమారస్వామే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో సినిమాను రిలీజ్‌ చేయకపోవడమే మంచిదని అనడం గమనార్హం. హైకోర్టుఆదేశాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు, ఓ కన్నడిగుడిగా ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్‌ చేయకపోవడమే మంచిది అని కుమారస్వామి అన్నారు. రెండేళ్ల కిందట తమిళనాడులో ఓ కన్నడ మూవీకి ఎదురైన పరిస్థితిని ఆయన వివరించారు. నాగరహవు అనే కన్నడ మూవీని తమిళనాడు థియేటర్ల నుంచి తీసేశారు. ఆ సినిమా తమిళంలోకి డబ్‌ అయింది కూడా. కన్నడ మూవీలపై వివక్ష చూపించారు అని కుమారస్వామి చెప్పారు. ప్రభుత్వ పరంగా మేం అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ సంఘాలు నిరసన తెలిపితే, ప్రజలు సినిమా చూడటానికి ముందుకు రాకపోతే.. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు సినిమాను రిలీజ్‌ చేయకపోవడమే మంచిది అని ఆయన అన్నారు.