కాలుష్యనగరంగా హైదరాబాద్‌

` పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగాప్రణాళికలు
` మెట్రో పనులు వేగవంతం చేయాలి
` నగరానికి ఐకానిక్‌గా మూసీ అభివృద్ధి ఉండాలి
` ఎంఏయూడీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢల్లీి, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… అటువంటి పరిస్థితి హైదరాబాద్‌ నగరంలో తలెత్తకూడదన్నారు. కోర్‌ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించాలని సీఎం ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని… ఇందుకు రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకుగానూ ఢల్లీి, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలో అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలని సీఎం సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని… నిర్మాణ రంగ వ్యర్థాలను సిటీలో ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా హైదరాబాద్‌ నగర మంచినీటి సరఫరా.. సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. బోర్డు తమకున్న వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొంచుకోవాలని సీఎం సూచించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగానూ కులీకుతుబ్‌ షాహీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దానిని మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. మార్గదర్శకాల రూపకల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాతబస్తీలో మెట్రో పనుల పరిస్థితిపైనా సీఎం ఆరా తీశారు. అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున అక్కడ అక్కడ మెట్రో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్‌ల అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌ పేట ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటేడ్‌ కారిడార్‌ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయత్‌ సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్‌, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, చార్మినార్‌ లాంటి ఓ ల్యాండ్‌ మార్క్‌ను నిర్మించాలని సీఎం సూచించారు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని అధికారులకు తెలిపారు. నెహ్రూ జూ పార్క్‌, మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనుల్లో పురోగతిపైనా సీఎం సమీక్షించారు. మీరాలం ట్యాంక్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. జూ పార్క్‌, మీరాలం ట్యాంక్‌ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్‌ నిర్మించాలని… పార్క్‌, మీరాలం ట్యాంక్‌ తోపాటు నగరాన్ని వీక్షించేలా హోటల్‌ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది (హెచ్‌ఎండీఏ ఏరియా) కార్యదర్శులు ఇలంబర్తి, టి.కె.శ్రీదేవి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ కే.శశాంక, వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, మెట్రో రైలు ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఇ.వి. నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.