కాలుష్య కాసారాలుగా నగర చెరువులు

The Stinking hussainsagar lake near bathukama ghat

హైదరాబాద్‌ వర్ష విలయానికి చెరువుల కబ్జాయే కారణమని మనోమారు తాజా వర్షాలు నిరూపించాయి. చెరువులను కబ్జా చేయడం, అపార్టుమెంట్లు కట్టడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. చెరువులను కబ్జా చేసి ప్లాట్లు చేయడం లేకుంటే కాలుష్య జలాలను వదిలి వేయడం వల్ల హైదరాబాద్‌లో చెరువుల ఊసే లేకుండా పోయింది. కాలుష్య కాసారాలుగా మారిన చెరువులను కాపాడడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మిషన కాకతీయ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం హైదరాబాద్‌ చేరువులపై నజర్‌ పెట్టకపోవడం సరికాదు. తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా శివారు చెరువలన్నీ కబ్జాకు గురై అపార్టమెంట్లుగా అవతరించాయి. ఇందులో కిందిస్థాయి అధికారి నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరికి తోచిన విధంగా వారు చేయూతను అందించారు. జంటనగరాల్లో కొద్దిపాటి వర్షం పడ్డా నీరు బయటకు వెళ్లేని దుస్థితిలో ఉంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దవ్వడం ఒక ఎత్తయితే అక్రమ లే ఔట్లను నమ్మి ఇళ్లు కొన్న లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు వర్షం కంటివిూద కునుకు లేకుండా చేసింది. ఇకపోతే గ్రేటర్‌లో చెరువులపై కాలుష్య పంజా విసురుతన్నా అధికార యంత్రాంగం కదలడం లేదు. కాలుష్యం నురగలు కక్కుతుంటే షాంపూల వల్ల వచ్చిన నురగని ఘనత వహించి జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ప్రకటించడం బాధ్యతారాహిత్యం కాక మరోటి కాదు. కాలుష్యకారక పదార్థాలు నురగుల కక్కుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. ప్రస్తుతం గ్రేటర్‌ చుట్టుపక్కల ఉన్న చెరువులు, నాలాలను చూస్తే కాలుష్యం ఎంతగా నిండిపోయిందో చూడవచ్చు. ఒక్క హుస్సేన్‌ సాగరే అనుకుంటే మొత్తం అన్ని చెరువులను కాలుష్య కాసారాలుగా మార్చారు. కాలుష్యకారక పరిశ్రమలు వదిలిపెడుతోన్న రసాయన వ్యర్థాలతో నాలాలు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ ఈ జలాశయాలకు సవిూపంలో ఉన్న శివారు ప్రాంతాలను కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. ఆయా చెరువుల్లో కాలుష్యాల కారణంగా స్థానికుల మనుగడా ప్రశ్నార్థక మవుతోంది. గ్రేటర్‌ హైదరనాబాద్‌ను ఆనుకుని ఉన్న అనేక బల్క్‌డ్రగ్‌, ఫార్మా, ఇతర రసాయనిక పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. జల వ్యర్థాలను శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు కానారావడం లేదు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు దీనిని గుర్తించడం లేదు. వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. పలు పరిశ్రమలు వాటిని పట్టించుకోవడం లేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమలు గాలికొదిలేశాయి. అలాగే మల్లాపూర్‌, ఉప్పల్‌, కాటేదాన్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, దుండిగల్‌, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నాయి.

మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్‌ చేస్తున్నారు. కొందరు పరిశ్రమల ప్రాంగణం లోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యర్థాల డంపింగ్‌తో కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామిక వాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు ప్రమాదకరమైన రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లుగా తేలింది. ఇకపోతే గ్రేటర్‌ పరిధిలో మొత్తం 185 చెరువులుండగా కూకట్‌పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లా

పూర్‌, కాటేదాన్‌, ఉప్పల్‌, మల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు వంద చెరువుల్లోకి యధేచ్ఛగా పారిశ్రామిక వ్యర్థాలు చేరుతున్నాయి పరిశ్రమల్లో నిత్యం వెలువడుతోన్న ఘన, ద్రవ వ్యర్థాలను ప్రధాన చెరువులు, కిలోవిూటర్ల మేర ప్రవహిస్తోన్న నాలాలతోపాటు మూసీలోకి ప్రవేశిస్తున్న నాలాల్లోకి వదిలిపెడుతున్నారు. తాజాగా కూకట్‌పల్లి ప్రాంతంలో పలు కాలనీలు, బస్తీలను తెల్లటి నురుగు కమ్మేయడం ఈ కాలుష్యం వల్లనే అని ఎవరిని అడిగినా చెబుతారు. పలు ప్రాంతాల్లో పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను భారీ కంటెయినర్లలో తరలించి నాలాల్లోకి వదిలిపెడుతున్న కారణంగానే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి. పారిశ్రామికవాడల్లో కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతోన్న ఘన, ద్రవ వ్యర్థాలు చెరువులు, నాలాలు, మూసీని కాలుష్యంతో ముంచేస్తున్నాయి. దీంతో ఆయా చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రసాయనాలు కలసి రంగు మారిపోయిన చెరువు నీళ్లు తాకితే చాలు ఆయా ప్రాంతాల వాసులు చర్మ, శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నారు. అయితే చెరువులు, నాలాల్లోకి ప్రవేశిస్తున్న వ్యర్థాలను కట్టడి చేయడంలో జీహెచ్‌ఎంసీ, పీసీబీ, పరిశ్రమల శాఖ చోద్యం చూస్తోంది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌కు 30 కి.విూ. ఆవలకు తరలించాలని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అయితే వీటి తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. నగర శివార్లలోని ముచ్చెర్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మాసిటీ, చౌటుప్పల్‌ సవిూపంలోని మల్కాపూర్‌, చిట్యాల తదితర ప్రాంతాలకు పరిశ్రమలను తరలించాలన్న ప్రభుత్వ సంకల్పం కాగితాలకే పరిమితం కావడంతో గ్రేటర్‌లో పర్యావరణ ధ్వంసం అవుతోంది. నగరం నడిబొడ్డుతో పాటు శివారు చెరువులు, కుంటలు కాలుష్య కారకాలుగా మారాయి. అలాగే జంటనగరాలల్లో ఎన్ని చెరువుల మాయమయ్యాయో నిజాంపేట, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షవిలయం చూస్తే తెలుస్తుంది. ఇప్పటికైనా సర్కార్‌ మేల్కోకుంటే కాలుష్య కాసారాలతో నగర జీవనం మరింత దుర్భరం కాగలదు.