కాల్పులు ఆపండి అంటూ వేడుకున్న పాక్

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): పాకిస్థాన్‌కు మరోసారి ఇండియన్ ఆర్మీ పవరేంటో తెలిసొచ్చింది. చీటికీమాటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్). దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది.
దయచేసి కాల్పులు ఆపండి అంటూ పాక్ బలగాలు వేడుకున్నట్లు బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. మూడు రోజులుగా బీఎస్‌ఎఫ్ బలగాలు పాక్ స్థావరాలపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. దీంతో వాళ్లకు భారీ నష్టం వాటిల్లింది. ఓ రేంజర్ కూడా చనిపోయాడు అని ఆ అధికారి తెలిపారు. దీంతో పాక్ రేంజర్స్ జమ్ములోని బీఎస్‌ఎఫ్ యూనిట్‌తో కాళ్ల బేరానికి వచ్చారు. 
వాళ్లు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటే అదే స్థాయిలో సమాధానమిస్తాం. పాక్‌లో పంట కోతలు ఈ మధ్యే పూర్తయ్యాయి. దీంతో వాళ్లు ఇలాంటి పనేదో చేస్తారని ముందే ఊహించి సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎఫ్ ఐజీ రామ్ అవ్‌తార్ చెప్పారు. జమ్ముకు 30 కిలోమీటర్ల దూరంలోని అఖ్నూర్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక చికెన్ నెక్ ఏరియాలో పాక్ బలగాలపై బీఎస్‌ఎఫ్ రాకెట్ దాడి చేసింది.