కాళేశ్వరంను కూలేశ్వరం అన్నట్టే…పోలవరంను కూలవరం అనగలరా?

` అక్కడో నీతి..ఇక్కడో నీతా
` మేడిగడ్డకు ఎందుకు మరమ్మతులు చేయట్లేదు?
` బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై మండిపడ్డ కెటిఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై విమర్శలు చేస్తున్నారు. 24 గంటల్లో భాజపా నేతలు ఎన్డీఎస్‌ఏను దించి భారత రాష్ట్ర సమితిపై బురదజల్లారు. కొట్టుకుపోయిన పోలవరం కాఫర్‌ డ్యామ్‌పై భాజపా నేతలు మౌనంగా ఉన్నారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపా నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నంచారు.జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్‌ డ్యామ్‌, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించడం లేదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు ‘పోలవరంను.. కూలవరం‘ అనే దమ్ము ధైర్యం ఉందా..? అని అడిగారు.తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా..? అని ప్రశ్నించారు. ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్‌ డ్యామ్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్‌ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్‌కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే అని కేటీఆర్‌ మండిపడ్డారు. 2020లో పోలవరం డయాఫ్రం వాల్‌ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకూ లేదు. మరోసారి ఏపీలో పోలవరం కాఫర్‌ డ్యామ్‌ గోదావరిపాలైనా, ఇటు- తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్‌ఏ అడ్రస్‌ లేదు. పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం.. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జై తెలంగాణ.. జై కాళేశ్వరం.. అని కేటీఆర్‌ నినదించారు.