కాళేశ్వరంపై కలెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వివరాలను తెలిపిన ఇన్‌సి
వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరేముందు వారికి దీనికి సబంధించిన పూర్తి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. దీనిని సందర్శించేందుకు వరంగల్‌ నుంచి కలెక్టర్లు  ఉదయం బయలుదేరి వెళ్లారు. పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు జిల్లా కలెక్టర్లు బయలుదేరారు. ముందుగా మెడిగడ్డ బ్యారేజ్‌ క్యాంపు కార్యాలయానికి కలెక్టర్లు చేరుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజిని సందర్శించారు. నీటి లభ్యత, బ్యారేజ్‌  సామర్థ్యం, ప్రస్తుత నీటి నిల్వ, వరద సమయంలో నీటి ప్రవాహం, గేట్ల నిర్మాణం మొదలైన అంశాలపై కలెక్టర్లకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. తర్వాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కన్నేపల్లి లక్ష్మీ పంప్‌ హౌస్‌ను సందర్శించి అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం భూగర్భ పంప్‌ హౌస్‌ను చేరుకునున్నారు. కలెక్టర్ల పర్యటన దృష్ట్యా ప్రాజెక్టు ప్రాంతాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వారి రాక సందర్భంగా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.