కాళేశ్వరం నీటితో చెరువులకు మహర్దశ
చంద్రబాబు చేతికి జుట్టిచ్చిన కాంగ్రెస్
ప్రచారంలో తాటికొండ రాజయ్య
జనగామ,నవంబర్10(జనంసాక్షి): ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దీంతో గోదావరి జలాలు అన్ని గ్రామాలను తడపనున్నాయని అన్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కేసీఆర్ దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. పలుగగ్రామాల్లో పర్యటిస్తూ ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు చనిపోయిన వారి పేర్లపై కోర్టుకెళ్లారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ చెరువును గోదావరి జలాలతో తప్పకుండా నింపుతామన్నారు. సొంత స్థలాలుంటే డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసేలా వెసలుబాటు కలిగిస్తున్నామన్నారు. దళితులకు తప్పకుండా భూమిని పంచుతామన్నారు. నియోజకవర్గమే దేవాలయంగా ప్రజలే దేవుళ్లుగా భావిస్తూ అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. ప్రతీ గ్రామంలో ఉన్న చెరువును గోదావరి జలాలతో నింపుతున్నామని అన్నారు. మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటుంటే చంద్రబాబు పెత్తనం కోసం కాంగ్రెస్ నేతలు ఆరాట పడుతున్నారని అన్నారు. కూటమి కుట్రలను చిత్తులు చేయాలన్నారు. కేసీఆర్ కిట్, ఆడపిల్లలకు ఆరోగ్యకిట్లు, ఎదిగిన అడబిడ్డలకు కల్యాణలక్ష్మి ద్వారా చేయూతనిచ్చిన ప్రభుత్వాలు ఇంత వరకూ లేవన్నారు. ఇప్పటికీ రైతులకు పంటల పెట్టుబడి ఇవ్వొద్దని కాంగ్రెసోల్లు అడ్డుపడుతూ కోర్టులకు వెళ్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గ మనించాలన్నారు.