కావేరీపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు

ఇరు రాష్ట్రాల రైతులు ముఖ్యమే

కుమారస్వామితో కమలహాసన్‌ భేటీ

సత్వరం నిర్ణయం కోసం ప్రయత్నిస్తామని హావిూ

బెంగుళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ):కావేరీ నది జలాల వివాదంపై కర్నాటక సీఎం కుమారస్వామిని మరోసారి కలిశారు మక్కల్‌ నీది మయ్యమ్‌ నేత కమల్‌ హాసన్‌. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాను చేసిన విజ్ఞప్తికి కుమారస్వామి హుందాగా స్పందించారన్నారు. రెండు రాష్ట్రాల రైతులు నష్టపోకుండా.. పరస్పర అంగీకారం కోసం యత్నిస్తామన్నారు కమల్‌. మరోవైపు రెండు రాష్ట్రాల రైతులుతమకు ముఖ్యమేనని, రైతులు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు కర్నాటక సీఎం కుమారస్వామి.కావేరీ జలాల సమస్య పరిష్కారం చాలా కీలకమని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఈ అంశంలో తమిళనాడుతో ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఉభయ రాష్ట్రాల రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నటుడు, రాజకీయనేత కమల్‌హాసన్‌తో కలిసి కుమారస్వామి సోమవారం విూడియాతో మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు మధ్య విభేదాలకు ఎలాంటి తావు ఉండకూడదని కుమారస్వామి ఈ సందర్భంగా అన్నారు. ‘మనం (కర్ణాటక, తమిళనాడు) సోదరుల్లా సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలి. సమస్యలేమైనా ఉంటే విభేదాలకు తావులేకుండా మనం పరిష్కరించుకోవాలి. కర్ణాటక, తమిళనాడు రైతుల ప్రయోజనాలు చాలా కీలకం’ అని అన్నారు. కావేరీ సమస్య పరిష్కారంపై కుమారస్వామి అభిప్రాయలతో కమల్‌హాసన్‌ ఏకీభవించారు. ‘కావేరి మేనేజిమెంట్‌ బోర్డు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇదే తరహాలో ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే దృక్పథంతో మనం త్వరితగితిన ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మనం జలాలను పంచుకోవాలి…ఇందులో రెండో మాటకు తావు లేదు’ అని కమల్‌ అన్నారు. కావేరీ జలాల పంపిణీపై గత ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడుకు నిర్దేశిరచిన 192 టీఎంసీల జలాలకు బదులు 177.25 టీఎంసీలను కర్ణాటక విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు అమితవ్‌ రాయ్‌, ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన బెంచ్‌ ఆదేశించింది. తీర్పు వెలువడిన ఆరు వారాల్లోగా కావేరీ మేనేజిమెంట్‌ బోర్డు, కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే గడువులోగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని తప్పుపట్టింది.

———