కాశ్మీర్‌పై చర్చలకు సిద్ధం

4
– వాజ్‌పేయి బాటలో పయనిస్తాం

– ప్రధాని మోదీ

భోపాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి): అభివృద్ధి మంత్రంతోనే కశ్మీర్‌ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. వాజ్‌పేయి బాటలోనే తాము నడుస్తామని చెప్పారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఇన్‌సానియత్‌ (మానవత్వం), కశ్మీరియత్‌, జమూరియత్‌ (ప్రజాస్వామ్యం) అనే నినాదాలతో ముందుకు సాగారని, మేము కూడా ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామని తెలిపారు. భారత్‌ ఏదైతే స్వాతంత్య్రాన్ని అనుభవిస్తుందో అదే స్వాతంత్య్రాన్ని కశ్మీరీ ప్రజలు కూడా అనుభవించాలని పిలుపునిచ్చారు.గిరిజన జనాభా అధికంగా ఉండే అలిరాజ్పూర్‌ జిల్లాలోని భాభ్రా (అజాద్‌ కుతియా)ను సందర్శించి ఆజాద్‌ కు నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ జన్మించిన గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ అడుగుపెట్టారు. ఇదే ఆజాద్‌ జన్మించిన ప్రాంతం. ఆజాద్‌ త్యాగానికి గుర్తుగా భాభ్రా అనే ఈ ప్రాంతాన్ని చంద్రశేఖర్‌ ఆజాద్‌ నగర్‌ గా అధికారులు పేరు మార్చారు. ప్రధాని మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో భారతదేశంలో ఆజాద్‌ జన్మించిన ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో కలిసి ఇక్కడికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆజాద్‌ జీవితానికి సంబంధించి ఏర్పాటుచేసిన ప్రదర్శన విభాగాన్ని తిలకించారు. ఇక్కడి నుంచే మోదీ ‘ఆజాదీ యాద్‌ కరో కుర్బానీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఓ సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్‌పై భావోద్వేగ ప్రసంగం చేశారు. భారత్‌ అనుభవిస్తున్న స్వాతంత్య్రాన్నే కశ్మీర్‌ కూడా అనుభవించాలని ఆయన సందేశమిచ్చారు. భారత్‌కు కశ్మీర్‌ అంటే ఎంతో ప్రేమ అని.. ఓ పిడికెడంత మంది మాత్రమే తప్పుదోవలో వెళ్తూ కశ్మీర్‌ను గాయపరుస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా మోదీ కశ్మీర్‌పై ప్రసంగించారు.  భూతల స్వర్గంగా పేరున్న కశ్మీర్‌ను మళ్లీ అలా చేయాల్సిన బాధ్యత కశ్మీర్‌ యువకులపైనే ఉందని ప్రధాని అన్నారు. చేతుల్లో ల్యాప్‌టాప్స్‌, బాల్స్‌, బ్యాట్స్‌ పట్టుకోవాల్సిన యువకులు రాళ్లు పట్టుకుంటున్నారని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్‌కు శాంతి అవసరమని, అక్కడి ప్రజలు టూరిజం ద్వారా మరింత సంపాదించాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు.