కాశ్మీర్‌పై శాంతి చర్చలు
– విపక్షనేతలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ,ఆగస్టు 22(జనంసాక్షి): కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ప్రధాని మోదీతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను ప్రధానికి వివరించారు. పెల్లెట్ తుపాకీల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలు కోరారు. ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. కశ్మీర్ అంశంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని.. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశముందని విపక్ష నేతల బృందం వివరించింది. అక్కడ గత రెండు నెలలుగా ఉన్న పరిస్థితులు చర్చించారు. ప్రధానంగా భద్రతా బలగాలు వినియోగిస్తున్న పెల్లెట్ గన్స్ను వెంటనే నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. భద్రతాబలగాలు అల్లర్లను నియంత్రించడానికి పెల్లెట్ గన్స్ వాడటం మూలంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత తీవ్రంగా గాయపడినట్లు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ప్రధానికి మెమొరాండం సమర్పించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న వారితో చర్చలు ప్రారంభించి శాంతిపూర్వక వాతావరణం నెలకొల్పాలని వారు కోరారు.హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన హింసతో కశ్మీర్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు జవాన్లతో పాటు 60 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ఇప్పటికీ శ్రీనగర్/-తో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.