కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఐదుగురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : జమ్మూకశ్మీర్‌లో శనివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌దార్‌ సెక్టర్‌ వద్ద ఉగ్రవాదులను ఎల్వోసీ దాటుతున్న దాటుతున్నట్లు గుర్తించిన భద్రతా బలగాళు వారిపై కాల్పులు జరిపి తుదముట్టించారు. శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులను గుర్తించిన వెంటనే వాళ్లను షూట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది సరిహద్దు రేఖను దాటుతున్నారన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయలేకపోయారు. గత కొన్ని
రోజులుగా పాక్‌ రేంజర్లు  పదే పదే కాల్పులు చేస్తున్నారు. దీంతో ఎల్వోసీ రేఖ వెంబడి భద్రతా దళాలు నిఘాను పెంచాయి. మోటర్‌ షెల్లింగ్‌కు కూడా పాక్‌ రేంజర్లు పాల్పడుతున్నారు. దీంతో ఉగ్రవాదులు  ఆ సమయంలో భారత్‌లోకి ప్రవేశించే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత బలగాలు.. ఎల్వోసీ వెంట పక్కా గస్తీ నిర్వహిస్తున్నాయి. తమ దేశ జైల్లలో ఉన్న కిరాతక ఖైదీలను భారత్‌లోకి పంపించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రయత్నిస్తున్నట్లు రహస్య వర్గాల ద్వారా వ్యక్తమవుతున్నది. ఆ ఖైదీలే భారత ఆర్మీ పోస్టులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలు శిక్షను తగ్గించేందుకు వాళ్లు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ఆర్మీ కూడా స్పష్టం చేసింది.