కాశ్మీర్‌లో మంచు దుప్పటి
స్థంభించిన జనజీవనం
శ్రీనగర్,ఫిబ్రవరి3(జనంసాక్షి): మంచు ముసుగుతో కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా విలవిల్లాడుతోంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే హైవే మార్గం విపరీతమైన మంచుతో కప్పుకుపోయంది. మంచుగడ్డను తొలగించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. గత మూడు రోజులులగా విపరీతమైన మంచుతో జనజీవనం స్తంభించింది. జమ్మూ-కశ్మీర్ రహదారులు మంచు గడ్డలతో నిండిపోయాయి. అనూహ్యంగా కురిసిన మంచువల్ల ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజౌరీలో హైవే విూద మంచు పేరుకుపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో స్థానికులు, టూరిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలుచేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు బయటకు వచ్చి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా మంచు కురవడంతో సాధారణ జీవితం అస్తవ్యస్తంగా మారింది.