కాశ్మీర్‌లో మరో నలుగురి మృతి

4

శ్రీనగర్‌,ఆగస్టు 16(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. బుద్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతిచెందారు. దీంతో గత నెల రోజులుగా కశ్మీర్‌లో మృతిచెందిన పౌరుల సంఖ్య 62కు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గమ్‌ ప్రాంతంలో ఓ సీఆర్పీఎఫ్‌ వాహనంపైకి కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో భద్రతాసిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. మరో 15మంది గాయపడ్డారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నేత బుర్హాన్‌వానీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో గత నెలరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.