కాశ్మీర్‌లో శాంతి కావాలి
– లోక్‌సభలో తీర్మాణం
– అఖిలపక్షనేతలతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి): కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై లోక్‌సభలో ఇవాళ తీర్మానం చేశారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలంటూ ఏకగ్రీవంగా సభలో తీర్మానించారు. జాతీయ భద్రత, సమగ్రతకు భంగం వాటిల్లరాదంటూ తీర్మానాన్ని ఆమోదించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీర్మానంపై మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. కశ్మీర్‌లో జరిగిన ప్రాణ నష్టం పట్ల సభ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కశ్మీర్ అంశంపై సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభ్యులందరూ దాన్ని స్వాగతించారు. జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు వెనక్కి తగ్గేది లేదని, కశ్మీర్ లోయలో శాంతి స్థాపన కోసం తక్షణమే చర్యలు చేపట్లాలని తీర్మానంలో కోరారు. తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో చదివి వినిపించారు. అంతకుముందు కశ్మీర్ అంశంపై తీర్మానం చేయాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదిలావుంటే జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు భవనం లైబ్రరీలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, తెదేపా ఎంపీ వైఎస్ చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. కశ్మీర్‌లో ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతాదళాలు మట్టుబెట్టడంతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. నెల రోజులుగా కశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ పరస్థితిని చక్కదిద్దడం కోసం ప్రభుత్వం అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది.