‘కాసు ‘విగ్రహం ధ్వంసం కేసులో విమలక్క అరెస్ట్
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి):
తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నేత, గాయకురాలు విమలక్కను బంజా రాహిల్స్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్కు ఎదుట ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్ర హాన్ని విధ్వంసం చేసిన కేసులో పోలీసులు విమలక్కను ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. అనంతరం సెంట్రల్ కైమ్ర్ స్టేషన్ (సీసీఎస్)కు తరలించారు. ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుమిగూడడం, విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై అనుచితంగా ప్రవర్తించడం తదితర అభియోగాల కింద వారిపై 147, 148, 149, 332, 335, 425 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు సెప్టెంబర్ 17న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియనివ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంపై టైర్లు వేసి కాలబెట్టడంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. ఘటనా స్థలంలో తెలంగాణ జన ప్రతిఘటన పేరుతో కరపత్రాలు వదిలివెళ్లారు. కేబీఆర్ పార్కు పేరు మార్చాలని, కాసు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలని అందులో డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తమ కార్యకర్తలే ధ్వంసం చేశారని టీయూఎఫ్ నేత విమలక్క ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా ప్రకటించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఎందరో తెలంగాణవాదులను కాసు కాల్చిచంపించారని, అందుకే ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాసు సహా తెలంగాణకు చెందిన మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు విగ్రహాలను తమ ప్రాంతంలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. విగ్రహం ధ్వంసం చేసింది తామేనని విూడియా ముఖంగా విమలక్క స్వయంగా చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేయాలని నిర్ణయించారు. అయితే, 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్ నేపథ్యంలో అరెస్టు చేస్తే జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ఉన్నతాధికారులను సంప్రదించారు. తెలంగాణ మార్చ్‌కు ముందే ముఖ్య నేతలను అదుపులోకి తీసుకోవాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉన్నతాధికారులు పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో సోమవారం ఉదయమే పోలీసులు విమలక్క ఇంటికి చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం కేసులో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు విమలక్క అరెస్టు సందర్భంగా కొంత ఉద్రిక్తత తలెత్తింది. పలువురు తెలంగాణవాదులు, టీయూఎఫ్ నేతలు ఆమె అరెస్టును అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. విమలక్కను అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు వారిని నిలువరించి, విమలక్కను నేరుగా సీసీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
అంతకుముందు విమలక్క విూడియాతో మాట్లాడుతూ.. కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ద్రోహి అని, అందుకే తమ వాళ్లు విగ్రహాన్ని ధ్వంసం చేశారని సమర్థించుకున్నారు.
మరోవైపు, విమలక్క అరెస్టును తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. ఆమె అరెస్టును తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు తదితరులు తప్పుబట్టారు. తక్షణమే విమలక్కను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. విమలక్క అరెస్టు ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత వేదకుమార్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ మార్చ్ జరిగితీరుతుందని స్పష్టం చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని టీయూఎఫ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తెలిపారు. విమలక్కను వెంటనే విడుదల చేయాలని టీయూఎఫ్ నేత రియాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వాదనను అణచడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు.