కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి
కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: నవంబర్ 12, (జనంసాక్షి):
‘పల్లెలో మెతుకు కోసం ఎడారిలో వెతుకులాట’ ‘పోట్టకూటి పోరులో పోరుగుదేశం తోవ’ పరాయి దేశానికి వెళ్లి షేకులకు బానిసలై కాయకష్టం చేసిన చేతులకు సంకెళ్లు పడి, జైళ్లలో మగ్గుతున్న తమ భర్తలను విడిపించుకోవాడానికి ఆఖరుకు కిడ్నీలను అమ్ముకునేందుకైన అనుమతించాలంటూ మానవహక్కుల కమిషన్ మెట్లనెక్కిన కరీంనగర్ జిల్లా మహిళల దీనగాధ కరీంనగర్ ఒక్కటే కాదు తెలంగాణలోని ప్రతి పల్లెలో కనిపించే సజీవ దృశ్యాలు.
తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు మహిళలు తమ కిడ్నిలను అమ్ముకునేందుకు అనుమతించండంటూ మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించిన సంఘటన ప్రతి ఒక్కరిని కలచి వేసింది. దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న తమ భర్తలను విడిపించేందుకు డబ్బుకావాలని, అందుకు తమ కిడ్నీలు అమ్ముకుంటామని మాకు అనుమతివ్వాలని వారు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. కానరాని దేశానికి వెళ్లి అక్కడ జైలుపాలైన వడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎందరో మహిళల దీన గాధ ముఖ్యంగా తెలంగాణ జిల్లాలోని ప్రతి పల్లెలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కనికరించక పోవటంతో కన్నీరే మిగిలిందని కిడ్నీలు అమ్ముకోవటమే శరణ్యమంటూన్నారు.