కిడ్నీ బాధితుడికి మంత్రి అండ

ప్రభుత్వ ఖర్చులతో వైద్యానికి ఆదేశం

ఖమ్మం,ఆగస్ట్‌28:  ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం చెందిన తమ్మారపు సాయిరాం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. క్యాంపు కార్యాలయం నుండి బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితుడు సాయిరాం ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత డాక్టర్లకు విషయాన్ని తెలియజేసి వైద్యం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని ఆ కుటుంబానికి హావిూ ఇచ్చారు. వెంటనే బయలుదేరి హైదరాబాదులో నిజాం ఆస్పత్రికి రావాలని సూచించారు. ఎటువంటి ఖర్చులేకుండా ఆ యువకునికి ఉచిత వైద్య సేవలందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ కుటుంబంలోని సభ్యులు తన కుమారుడికి వైద్యం చేయించేందుకు స్వయంగా రాష్ట్రమంత్రి

లక్ష్మారెడ్డి ఫోన్‌ చేయడంపై వారిలో మనోధైర్యాన్ని పెంపొందించారు. ఇప్పటివరకు తన కుమారుడికి వైద్యం ఎలా చేయించాలన్నా బాధతో ఉన్న తల్లిదండ్రులకు మంత్రుల నుంచి పిలుపు రావడంతో ఆనందించారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నా తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టడానికి కృషి చేస్తున్నా మంత్రికి రుణపడి ఉంటామని తండ్రి తమ్మారపు కోటేశ్వర రావు అన్నారు.