కిరణ్‌కు అమ్మ పిలుపు

తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి
ప్రకటనవైపే సోనియా మొగ్గు
ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణపై తేల్చేయాలనే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. సమస్యను నాలుగు దశాబ్దాలుగా నాన్చుతుండటం, ప్రజలు ఆకాంక్షను తెలియజెప్పేందుకు వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతో ఆ ప్రభావం యూపీఏలోని భాగస్వామ్య పక్షాలపై పడింది. ఈ నేపథ్యంలో యూపీఏలోని వివిధ పక్షాలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ ఇటీవల కోరుతున్నాయి. యూపీఏలో సంఖ్యాపరంగా నంబర్‌ టు స్థానంలో ఉన్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇటీవల ప్రధాని మన్మోహన్‌తో భేటి అయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేయమంటూ సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకనుగుణంగా నడుచుకోవాలని, తద్వారా ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధికలుగుతుందని చెప్పారు. దీనికి ప్రధాని సానుకూలంగానే స్పందించారని పవార్‌ ఆ తర్వాత మీడియాకు వివరించారు. అంతకుముందు యూపీఏకు బయటినుంచి మద్దతు ఇస్తున్న బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ సూచించారు. మరో యూపీఏ భాగస్వామ్య పార్టీ ఆర్‌ఎల్డీ అధినేత కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ మూడు రోజుల క్రితం
తెలంగాణపై స్పష్టత వచ్చిందని చెప్పారు. యూపీఏలోని మెజార్టీ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు అనుకూలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇంకా నాన్చడం భావ్యం కాదని ఆయన అన్నారు. ప్రజల నుంచి ఒత్తిడి, సొంత పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లో తిరగలేమని పదే పదే అధిష్టానం దృష్టికి తీసుకురావడం, అఖిలపక్షం తర్వాత తేల్చేస్తామని జాప్యం చేయడం వారు రాజీనామా చేసి ఉద్యమ బాటన నడవడంతో సోనియాగాంధీ సమస్యపై పునరాలోచనలో పడ్డారు. గతేడాది డిసెంబర్‌ 28న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలో నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది పార్టీలు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడం, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ఏకైక పార్టీ సీపీఎం సైతం తెలంగాణ ఇస్తామంటే అడ్డుకోబోమని తేల్చిచెప్పడంతో ఇంకా నాన్చి ప్రయోజనం లేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా సీమాంధ్ర ప్రాంతంలో పెద్దగా ప్రతిఘటన ఉండబోదంటూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన నివేదికపైనా అధ్యయనం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకొవాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసమే సోమవారం బయలుదేరి ఢిల్లీ రావాలంటూ అధినేత్రి ఆదేశాలను పార్టీ ముఖ్యులు సీఎం కార్యాలయానికి చేరవేశారు. దీంతో ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం కిరణ్‌ సన్నద్ధమయ్యాడు.