కిరణ్‌ను గద్దె దించేందుకు ఎవరు పోరుచేసినా నా మద్దతు

నాగం జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) :
కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును గద్దె దించేందుకు ఎవరు పోరు చేసినా నా మద్దతు ఉంటుందని తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ 10 వామపక్ష పార్టీలు ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన నిరవధిక దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆదివారం ఆయన దీక్ష శిబిరానికి వచ్చి వామపక్ష నాయకులను పరామర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ పేరప్రజలపై 32 వేల కోట్ల రూపాయల భారం మోపడం గతంలో ఎప్పుడు జరగలేదని అన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై ఎవరూ పోరాటం చేసినా తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సడక్‌ బంద్‌ సందర్భంగా తెలంగాణవాదులు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకున్నా నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి కోదండరాం, ఈటెల, జూపల్లి వంటివారిని జైళ్లలో పెట్టడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వేదికపై దీక్షలో ఉన్న వామపక్షాల నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.