కిరణ్ తిరుగుటపా
ప్రకటన దిశగా కేంద్రం అడుగులు
కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే
బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ సమస్యకు ముగింపునిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కిరణ్‌కు తేల్చిచెప్పారు. దీనిపై చర్చలు జరిపేందుకే ఢిల్లీ సీఎంను ఢిల్లీకి పిలిపించారు. పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో మొదలైన కిరణ్ భేటీల పర్వం మంగళవారం ప్రధాని మన్మోహన్‌తో చర్చల తర్వాత ముగిసింది. గత నెల 28 లోపే తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉన్న ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందంటూ కేంద్రం మరోసారి ఈ అంశాన్ని వాయిదా వేసింది. గత నెల 28 తర్వాత తెలంగాణలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. యూపీఏ భాగ్యస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌డీ అధినేతలు శరద్‌పవార్, అజిత్‌సింగ్ తెలంగాణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ చేస్తోంది. బిల్లు పెడితే తాము మద్దతు ఇస్తామని ప్రకటించింది. యూపీఏకు వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఎన్డీఏ వైపు నుంచే కాక యూపీఏ భాగ్వస్వామ్య పక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సోనియాగాంధీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అంశంపైనే ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, రక్షణ శాఖ మంత్రి ఆంటోని తదితరులతో సమావేశమయ్యారు. తెలంగాణపై ముఖ్యమంత్రి వైఖరిని వారు తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యతో కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సోమవారం సమావేశమయ్యారు. తన మనమరాలి వివాహ పత్రికను ఇచ్చేందుకే రోశయ్య ఢిల్లీ వచ్చిన్నట్లుగా చెబుతున్నా ఆయన్ను కాంగ్రెస్ పెద్దలే ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. ఆయనను కూడా తెలంగాణపై అభిప్రాయం అడిగినట్లు తెలుస్తోంది. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే రక్షణ శాఖ మంత్రి ఏకె ఆంటోని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫోన్ చేసినట్టు సమాచారం. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా గవర్నర్‌కు ఫోన్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. తెలంగాణపై అభిప్రాయ సేకరణలో భాగంగానే గవర్నర్‌ను ఈనెల 8న ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయాలతోపాటు మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటామని షిండే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా నేడో రేపో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీకి పిలవనున్నట్లు తెలిసింది. వీరందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మూడు ప్రాంతాలకు చెందిన నాయకులను కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు బొత్సా ప్రయాణానికి కూడా సన్నద్ధమవుతున్నాడు.