కివీస్‌ కెప్టెన్సీ నుండి టేలర్‌ ఔట్‌.?

వెల్లింగ్టన్‌ ,డిసెంబర్‌ 4: వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ రాస్‌ టేలర్‌పై వేటు పడనుంది. అతన్ని సారథ్య బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నట్టు కివీస్‌లో పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. కోచ్‌ మైక్‌ హెస్సన్‌ నివేదికతోనే న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు దీనికి ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలో జరిగే సౌతాఫ్రికా పర్యటన కోసం జట్టును ప్రకటించనుం డగా… కొత్త సారథిని కూడా కివీస్‌ సెలక్టర్లు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. గత ఏడాది న్యూజిలాండ్‌ సార థిగా బాధ్యతలు తీసుకున్న టేలర్‌ తర్వాతి నెల నుం డే గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాడు. శ్రీలంక చేతిలో పరాజయంతో ప్రారంభమైన కివీస్‌ పతనం… తర్వాత భారత గడ్డపైనా నిరాశపరిచింది. టేలర్‌ కెప్టెన్సీలో ఆ జట్టు 13 టెస్టులకు గానూ ఏడింటిలో ఓడిపోయిం ది. నాలుగింటిలో గెలిచి మరో రెండు డ్రా చేసుకుంది. నాలుగు విజయాలలో రెండు పసికూన జింబాబ్వేపై వచ్చినవే. అలాగే ఈ ఏడాది వెస్టిండీస్‌, శ్రీలంక జట్లపై వన్డే సిరీస్‌లోనూ ఓటమి చవిచూసింది. దీంతో జట్టు ప్రదర్శనతో పాటు కెప్టెన్‌ టేలర్‌పైనా కివీస్‌ సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్టు ఆ దేశ విూడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ప్రకారం సారథిగా టేలర్‌ను తప్పించి కొత్త వ్యక్తిని నియమించాలని కివీస్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఈ వారం చివర్లో సౌతాఫ్రికా పర్యటన కోసం ప్రకటించే జట్టులో కూడా పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.