కుంభమేళా మహత్తరఘట్టం
– ప్రధాని మోదీ
ఉజ్జెయిని,మే14(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న వైచారిక్ మహా కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సులో సాధువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ వేడుకకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా హాజరయ్యారు. సదస్సుకు హాజరైన సాధువులందరికీ మోదీ శిరస్సు వంచి వందనాలర్పించారు. ఉజ్జెయినిలో జరుగుతోన్న సదస్సు ఓ కొత్త ప్రయత్నమని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిపేందుకు ఈ సదస్సు నిదర్శనమన్నారు. సాయం చేసినవాళ్లకు, సాయం చేయనివాళ్లకు కూడా క్షేమం జరగాలని భిక్షువులు ఆశిస్తారని, అలాంటి సాంప్రదాయం మనదని మోదీ అన్నారు. రాత్రి పూట ఆహారాన్ని త్యజించాలని ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒకప్పుడు దేశ ప్రజలను ఉద్దేశించి కోరారు, దాన్ని పాటించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు. జ్ఞానం అమరమైనదని, ప్రతి యుగంలోనూ అది దర్శనమిచ్చిందన్నారు. సముద్రాలు దాటి వెళ్లడం, ఒకప్పుడు అపవిత్రంగా భావించేవాళ్లు, కానీ ఆ ఆలోచనలు ఇప్పుడు మారాయని, అలాగే కాలంతో పాటు సంప్రదాయాలు కూడా మారుతుంటాయన్నారు.