కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేయాలి
` కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్
` తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి
కరీంనగర్(జనంసాక్షి):ఎప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుపాలు కావల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్నారు. తాను నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. తండ్రీ కొడుకులు ఇద్దరూ జీవితాంతం జైల్లోనే ఉంటారంటూ మండిపడ్డారు. మావోయిస్టు సానుభూతిపరులమంటూ తన పేరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పోలీసుల లిస్టులో చేర్చారని చెప్పారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ నేతలకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపడం లేదు?. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ ఇస్తే కొల్లిక్కి వస్తుందని పేర్కొన్నారు. రాధాకిషన్ వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ఉందని, కానీ విచారణ కోసం కేసీఆర్‌ను ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. నేను కూడా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తా. ఏ గుడికి రమ్మంటారో టైమ్, డేట్ చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్ లీగల్ నోటీసులకు నేను భయపడను’ అని అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండిరచారు. తాజాగా, బండి సంజయ్‌కి లీగల్ నోటీసు పంపించారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయన్నారు.