కుప్పలు తెప్పలుగా నయీం ఆస్తులు

1

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. దిమ్మతిరిగేలా ఆస్తులు కూడబెట్టినట్లు మెల్లగా గుర్తిస్తున్నారు. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినావిూ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్‌బుక్లు, చెక్‌బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్‌ డీసీపీ  చెప్పారు. ల్యాండ్‌ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు. నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు.బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నా మని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్‌ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు. కొండాపూర్లో ఒకే చోట 69 ఎకరాల భూమి ఉందని, దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా వేస్తున్నారు. ఇక పుప్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి సవిూపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు, హైదరాబాద్‌ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారు. ఎయిర్‌ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు,ఆడి కారు సహా ¬ండా సీఆర్వీ, ఫోర్డ్‌ ఎండీవర్‌ కార్లు,ఆయుధాలు, ఫోన్లు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 4 పిస్టల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డైరీలు, పెన్‌ డ్రైవ్లు, హార్డ్‌ డిస్‌క్లు, మెమొరీ కార్డుల, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్‌, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

నయీం మనుషులకు రిమాండ్‌

నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా,  నయీం డ్రైవర్‌ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఘర్హానా నిందితురాలు. దాంతో ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నార్సింగ్‌ పోలీసులు నిందితుల కస్టడీ పిటిషిన్‌ దాఖలు చేశారు.నయీమ్‌ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా, డ్రైవర్‌ భార్య అఫ్షాలు డెన్‌ కీపర్లుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. నయీం డెన్‌ నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాగా, నయీం అంత్యక్రియలు నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిపేందుకు బాడీని బంధువులకు అప్పగించారు. నయీం ఎన్‌కౌంటర్‌ తరవాత పోలసీఉలు దాడులు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురుని మంగళవార పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఇద్దరు, వలిగొండలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్‌ యాదవ్‌ నుంచి తపంచా, 4 రౌండ్ల తూటాలు, విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాజర్‌ నుంచి తపంచా, నాలుగురౌండ్ల తూటాలు, రూ.71వేలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.వలిగొండలో కొనపురి శంకర్‌, శ్రీశైలం, గుండు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి దందాలు నడిపారో కూపీ లాగుతున్నారు. దీంతోపాటే వివిధ ప్రాంతాలతో పాటు  గ్యాంగ్‌స్టర్‌ నయీం నివాసాల్లో పోలీసులు సోదాలు పూర్తయ్యాయి. నయీం ఐదు రాష్ట్రాల్లో .వెయ్యి కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. నగరశివారులోని అలకాపురి కాలనీలో ఉన్న నయీం నివాసంలో అర్థరాత్రి వరకూ సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన దస్తావేజులతో పాటు, రూ.2.8కోట్ల నగదు, కిలోకిపైగా బంగారం, నాలుగు తుపాకులు, వందల సంఖ్యలో తూటాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం నివాసంలో ఉంటున్న 8మంది పిల్లలు, ఇద్దరు మహిళలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. నయీం బంధువుల ఇళ్లలో వందల సంఖ్యలో సెల్‌ఫోన్లు  లభ్యమయ్యాయి. పోలీసులకు చిక్కకుండా సిమ్‌లు, ఫోన్లు మార్చినట్లు అనుమానం. హైదరాబాద్‌ పుప్పాలగూడ ఇంట్లో భారీగా ద్విచక్రవాహనాలు, సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడ ఇంట్లో 2 పెంపుడు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. నయీం పెంపుడు కుక్కలకు సంబంధించిన మెనూ చార్ట్‌ను గుర్తించారు. నయీం ఇళ్లలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నయీం అత్తవారింట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. 362 స్థిరాస్తి పత్రాలు, రూ.4.6లక్షలు, 100 చరవాణులు, తుపాకి స్వాధీనం చేసుకున్నారు. నయీం భార్య, అత్త, బావమరిది సాదిక్‌పాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమాచారం మేరకుకొనసాగిస్తున్నారు.

నయీమ్‌ ఆస్తులపై ఐటీ అధికారులు ఆరా

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగస్టర్‌ నయీమ్‌ ఆస్తులపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆరా తీసున్నారు. నయీమ్‌కు  సంబంధించిన మొత్తం సమాచారం తమకు ఇవ్వాలని ఆ శాఖ అధికారులు పోలీసులను కోరారు. ఇదిలా ఉంటే… అల్కాపురిలోని నయీమ్‌ నివాసంలో పోలీసుల సోదాలు పూర్తయ్యాయి. నయీమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు  తరలించారు. అయితే అప్పటికే నార్సింగ్‌ పీఎస్‌ చేరుకున్న ఇన్‌కమ్‌ న్కంట్యాక్స్‌ అధికారులు ఆయా డాక్యుమెంట్లను పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో గ్యాంగస్టర్‌ నయీమ్‌ పోలీసుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. నయీమ్‌ నివాసంతోపాటు అతడి అనుచరులు, బంధువుల ఇళ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయిల నోట్ల కట్లతోపాటు దాదాపు రెండు కేజీల బంగారం.. భారీగా మారణాయుధాలు… వేల కోట్ల విలువైన ఆస్తి పత్రాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఇన్కంట్యాక్స్‌ అధికారులు నయీమ్‌ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. కాగా మరో 48 గంటలు పాటు సోదాలు జరిగితేనే కానీ మొత్తం ఎంత సంపద ఉందో తెలియదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. నయీమ్‌ అనుచరులు, బంధువుల ఇళ్లపై పోలీసులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అత్తగారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 సెల్‌ఫోన్లు, లెక్కకు మించిన సిమ్‌ కార్డులతోపాటు 362 ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రూ.4.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం అత్త, బావమరిది, సోదరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నారు.