కుమారకు తలనొప్పిగా మంత్రివర్గ కూర్పు

తాజా పరిస్థితులపై బిజెపి నజర్‌
అసంతృప్తులకు గాలం వేసే పనిలో నేతలు?
బెంగళూరు,మే30(జ‌నం సాక్షి): వారం రోజులైన కర్నాటకలో మంత్రివర్గ కూర్పు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు సొంతంగా నిర్ణయాలేవీ తీసుకోలేని దుస్థితిలో అధికార జెడిఎస్‌ ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా మంత్రివర్గంలో తన ముద్ర ఉండేలా, తన చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో ఎవరికి ఏ పదవి అన్నది కొలిక్కి రాలేదు. మరనోవైపు ఈ వ్యవహారాలను బిజెపి జాగ్రత్తగా గమనిస్తోంది. అధికార పీఠానికి కేవలం ఏడుసీట్ల దూరంలో ఉన్న ఈ పార్టీ అధికారంపై ఇంకా ఆశలు వదులకోలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌లొ ఉన్న అసంతృప్తులను బుజ్జగించి బుట్టలో వేసుకునే పనిలో ఉందని సమాచారం. అందుకే మంత్రివర్గ కేటాయింపుల్లో పొడచూపుతున్న అసంతృప్తులపై బిజెపి కన్నేసింది. చాప కింద నీరులా మళ్లీ వ్యూహాఇలు పన్నుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ముందునుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. వారంతా బిజెపికి టచ్‌లో ఉన్నారు.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పోలీసు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి కుమారస్వామి నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్‌ బేషరతు మద్దతుతో  అట్టహాసంగా అధికారపీఠాన్ని అధిరోహించిన కుమారస్వామికి ఇప్పుడు మంత్రి పదవుల కేటాయింపు పెను సమస్యగానే పరిణమిస్తోంది. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడితో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమిలోని ఒక ఎమ్మెల్యే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక స్థానిక టీవీ సంచలన కథనంగా ప్రసారం చేసింది. కుమారస్వామి కూడా మంత్రివర్గ సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్‌తో కలిసి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి మంతనాలు జరుపుతున్నారు. కేబినెట్‌ విస్తరణ అనంతర రాజకీయ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశాలనూ ఇరువురు పార్టీల నేతలు సమగ్రంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. బిజెపి అధినాయకత్వం కూడా కర్నాటకలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కన్నేసింది. క్యాంపు రాజకీయాలు కాకుండా తమంతకు తాముగానే పార్టీలోకి వచ్చేవిధంగా వ్యూహాలు రచించాలని, ఆ విధంగా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రాష్ట్ర బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఏర్పాటుపై కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులతో  ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశ ఉందని తాజా సమాచారం. మంత్రివర్గం ఏర్పాటుపై జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాగా, తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని నివారించేందుకు పార్టీ సీనియర్‌ నేత గులామ్‌ నబీ అజాద్‌తో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎప్పటికప్పడు పరిసితిని తెలుసుకుంటున్నారు.మరోవైపు రాష్ట్ర  సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన  ముఖ్యమంత్రి కుమారస్వామి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. రైతులకు రుణమాఫీ విషయంపై ¬ంశాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. రుణమాఫీ మొత్తాన్నిమొత్తాన్ని రూ.53 వేల కోట్ల వరకూ పెంచడానికి మార్గాలను అన్వేషించాలని ఆయన ఆదేశించారు. రుణమాఫీ ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించేందుకు రైతు సంఘాల నేతలను కూడా ముఖ్యమంత్రి చర్చలకు పిలిచారు. నాలుగు దశల్లో రుణమాఫీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. రుణమాఫీ పటిష్టంగా అమల్జేసేందుకు ఈ వ్యవహారాలన్నిటినీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పర్యవేక్షిస్తే బావుంటుందని, 13 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆయనకున్న అనుభవం ఎంతో దోహదపడుతుందని ఉన్నతాధికారులు కుమారస్వామికి సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారానలు నడుపుతూనే పాలనపై పట్టు పెంచుకునేందుకు కుమారస్వామి యత్నిస్తున్నారు. సిద్దరమాయ్యజోక్యం మరీ ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నారు. అలాగే గోడదూకే వారిపై కన్నేసి పెట్టారు. మొత్తంగా బిజెపి ఎలాంటి వ్యూహం అనుసరించనుందన్నది రానురాను తెలియనుంది.