కూటమికి ఓటేస్తే సంక్షోభమే


– టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం
– కాంగ్రెస్‌ గులాం గిరి కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలి?
– తెలంగాణ ప్రాజెక్టులను అపేందుకు బాబు లేఖలు రాస్తుండు
– కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ నేతలు బాబుతో క్షమాపణలు చెప్పించాలి
– అప్పుడే తెలంగాణలో ఓటు అడిగే అర్హత కూటమికి ఉంటుంది
– నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచాం
– అభివృద్ధిని అండగా నిలిచి మరోసారి తెరాసను గెలిపించండి
– ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు
రంగారెడ్డి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : మహాకూటమితో కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, కూటమికి ఓట్లేస్తే తెలంగాణ మళ్లీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచాంలో హరీశ్‌రావు జిల్లా పార్టీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.  అనంతరం ఇబ్రహీంపట్నంలో జరిగిన రైతు సమ్మేళనం సదస్సుకు హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కూటమికి ఓట్లేస్తే ఢిల్లీ, ఆంధ్రా నేతల పత్తెనం సాగుతుందని, ఏ చిన్న పని చేయాలని రాహుల్‌, చంద్రబాబు పర్మిషన్లు తీసుకోవాలన్నారు. అదే కేసీఆర్‌ మరోసారి సీఎం అయితే మన పాలన మనమే పాలించుకోవచ్చని, ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్‌ గులాం గిరి కావాలా?.. తెలంగాణ ఆత్మగౌరవం కావాలో ఓటు ద్వారా తెలియజేయాలన్నారు. గత పాలకుల హయాంలో అడ్డాకూలీగా ఉండే వారు.. తెరాస నాలుగేళ్ల పాలనలో ఉన్న కొద్ది పొలంలో పంటలు పండించుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. గతంలో వలసలు పోయిన పాలమూరు ప్రజలంతా కేసీఆర్‌ పాలనతో వెనక్కు వస్తున్నారన్నారు. ముంబాయి బస్సులు ఖాళీగా పోతున్నాయని, ముంబాయిలో అడ్డాకూలీలు దొరడం లేదని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, దీనంతటికి కారణం కేసీఆర్‌ అద్భుత పాలనతో పాలమూరు, ఇతర ప్రాంతాల వలసలు బంద్‌ కావటమే కారణమని హరీష్‌రావు తెలిపారు. తెరాస హయాంలో 25లక్షల ఎకరాలకు నీళ్లించామని, 12 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని హరీష్‌రావు పేర్కొన్నారు. 13లక్షల ఎకరాలకు చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరించినట్లు తెలిపారు. గత పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞంతో నీటిపారిస్తామని ధనయజ్ఞంగా మార్చుకొని వారి జేబులు నింపుకున్నారని విమర్శించారు. పదేళ్లలో 4లక్షల ఎకరాలకు నీరిస్తే, తెరాస నాలుగేళ్ల పాలనలో 25లక్షల ఎకరాలకు సాగునీరందించామని అన్నారు. వసలుపోయిన కూలీలను తెరాస హయాంలో వాపసు తెచ్చుకుంటే.. కాంగ్రెస్‌ నేతలు వలసలు పోయిన ఆంధ్రా
నాయకులను తెలంగాణకు వలసలు తెచ్చుకుంటున్నారని హరీష్‌రావు విమర్శించారు. మాకు టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవటం చేతకావటం లేదు.. విూరు రండి అంటూ చంద్రబాబు తీసుకొస్తున్నారని, ఇందుకోసమేనా మనం తెలంగాణను సాధించుకుందని ప్రశ్నించారు. తెలంగాణలోని కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల నేతలు చంద్రబాబు వద్ద చేతులు కట్టుకోవాల్సిన బతుకు వచ్చిందన్నారు. మనను మనం పరిపాలించుకోవటం తెలంగాణను తెచ్చుకుంటే కాంగ్రెస్‌ నేతలు మళ్లీ ఆంధ్రావాళ్లకు పెత్తనం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలకు ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నా అమరావతిపోయి చంద్రబాబు వద్ద పర్మిషన్‌ తీసుకోవాల్సిన దుస్థితి తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టిందని హరీస్‌రావు ఎద్దేవా చేశారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు కట్టాలా వద్దా అనేది చంద్రబాబుతో చెప్పించాలని తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులకు దేనికి నేనే వ్యతిరేకం కాదు, దేనిని అడ్డుకొనేందుకు నేను లెటర్‌లు రాయను అని తెలంగాణ ప్రజలకు చెప్పిన తరువాతే కూటమికి ఓటు అడే హక్కు ఉంటుందని, అప్పటి వరకు మహాకూటమి నేతలకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు ఉండదని హరీష్‌రావు అన్నారు. 60ఏళ్లలో 4లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మింస్తే, తెరాస నాలుగేళ్ల పాలనలో 17లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలను కట్టించామని అన్నారు. అందుకే ఎరువులు కొరత, విత్తనాల కొరత లేదన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామని, ఈ ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. అనంతరం ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా కనీసం అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందని అన్నారు. చంద్రబాబు కుట్రలు కాంగ్రెస్‌ నేతలకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం నాశనమైందన్నారు. ఇబ్రహీంపట్నంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడని తెలిపారు. కోటి ఎకరాలకు నీళ్లివ్వడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కోహెడలో పండ్ల మార్కెట్‌ వస్తుందని ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.