కూటమి కారణంగా సర్దుబాట్లు తప్పడం లేదు
వరంగల్,నవంబర్12(జనంసాక్షి): మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా అక్కడక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్లు గల్లంతవుతున్నాయని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు చంద్రబాబుతో చర్చించి తమ పార్టీవారికి న్యాయం జరిగేలా చూస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హావిూ ఇచ్చారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో సర్దుబాట్లు తప్పడం లేదన్నారు. సోమవారం వరంగల్లో టిక్కెట్ కోసం ఆందోళన చేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డిని విహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకూటమిలో అన్ని సమస్యలను పరిష్కరించుకుని కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం అందరికంటే రాజేందర్ రెడ్డి ఎక్కువగా కష్టపడి పని చేశారని, డీసీసీ అధ్యక్షుడుగా ఆయన చాలా కార్యక్రమాలు చేశారని.. ఈ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా చెప్పానని వీహెచ్ చెప్పారు. ఇంకా సమయం ఉందికాబట్టి అందరితో చర్చించి రాజేందర్ రెడ్డికి టిక్కెట్ వచ్చేలా ప్రయత్నం చేస్తానని హనుంతరావు హావిూ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న భరోసా కూడా టిక్కెట్ ఆవావహులను పెంచిందన్నారు.