కూటమి గెలుపు చారిత్రక అవసరం

టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి

వరంగల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): మళ్లీ తెరాసను గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యే ఉన్నానని ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే ఉంటానన్నారు. పొత్తులో భాగంగా వరంగల్‌ తూర్పులో పోటీకి దిగాల్సి వచ్చిందని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. నాలుగేళ్ల తెరాసపాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. 60 ఏళ్లలో రూ. 60 వేల కోట్ల అప్పుంటే నాలుగేళ్లలో రూ. 2.20 లక్షల కోట్లకు పెంచారని ఉద్యమ ఆకాంక్షతో అధికారంలోకి వచ్చి నియంత పాలనతో అన్ని వర్గాలను అణగదొక్కి దోచుకున్నారని దుయ్యబట్టారు. తెరాస అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 1.18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ నాలుగేళ్లలో 80 వేల మంది పదవీ విరమణ చెందితే కేవలం 18 వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. దళితులు, గిరిజనుల నిధులు దారి మళ్లించారని ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు మరిచారన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన చెల్లదని, కెసిఆర్‌ అహంకారంతో ఇష్టానుసారం మాట్లాడుతున్న అన్నారు. అందుకే కేసీఆర్‌ దుర్మార్గపు పాలన అంతం చేయాలన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కెసిఆర్‌ కుటుంబానికి ఓట్లడితే నైతిక హక్కులేదన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరినీ లెక్కచేయలేదని అన్నారు. ఈసారీ కూటమి గెలుపు చారిత్రక అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రజాకూటమి విజయదుందుబి మోగించటం ఖాయమని అన్నారు.