కూడం కుళం జాతికి అంకితం

4

– వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  తమిళనాడు రాష్ట్రం కూడంకుళంలోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు.  మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రష్యా అధ్యక్షుడు పుతిన్లు కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తిరునల్వెలి జిల్లా కూడంకుళంలో భారత్‌-రష్యాలు సంయుక్తంగా రూ.22వేల కోట్లతో రెండు యూనిట్ల అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌-రష్యా మధ్య సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. ఇరుదేశాలు సంయుక్తంగా మరిన్ని అణు విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఇంజినీర్లు కఠోర శ్రమకు వందనం అని మోదీ ప్రశంసించారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే.కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ద్వారా భారత్‌, రష్యా మధ్య చారిత్రక బంధం మరింత బలపడిందని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం జయలలిత ఇవాళ కూడంకుళం ప్రాజెక్టు మొదటి యూనిట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో లింక్‌లో మోదీ మాట్లాడారు. ప్రాజెక్టు ప్రారంభం వల్ల భారత, రష్యా ఇంజినీర్ల బృందానికి ఇది సంతోషకర విషయమన్నారు. నిర్విరామంగా పనిచేసిన ఇంజినీర్లకు సెల్యూట్‌ చేస్తున్నట్లు మోదీ చెప్పారు. భారత్‌, రష్యా మధ్య బంధం చిరకాలంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలో జరగనున్ను జీ20 సమావేశాల్లో పుతిన్‌ను కలవనున్నట్లు మోదీ తెలిపారు. శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్న భారత్‌కు కూడంకుళం యూనిట్‌-1 ప్రారంభం ఒక కీలక మలుపురాయి అని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం రెండు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్య బంధాన్ని బలపరుస్తుందని మోదీ అన్నారు.