కూతురిపై ఐదు నెలలుగా అఘాయిత్యం

విశాఖ: కన్నకూతురిపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతోన్న కసాయి తండ్రిని విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హార్బర్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ కె.రంగరాజు ఈ వివరాలను వెల్లడించారు. నగరంలో కొత్త జాారిపేటకు చెందిన ఓ వ్యక్తి(42) తన భార్య, కుమార్తెతో స్థానికంగా నివసిస్తున్నాడని తెలిపారు. నిందితుడు గతంలో ఓ ప్రయివేటు సంస్థలో పనిచేసేవాడని, ఇటీవల విధులకు వెళ్లడం మానేసి ఖాళీగా ఉంటూ వ్యసనాలకు బానిసయ్యాడన్నారు. అతని భార్య సమీపంలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లిన సందర్భాల్లో ఒంటరిగా ఉంటున్న కుమార్తె(14)పై ఆ కామాంధుడి కళ్లు పడ్డాయని వివరించారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయం ఇటీవల బాలిక తల్లికి తెలియడంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందన్నారు. తల్లి బాలికను ప్రశ్నించగా గత ఐదు నెలలుగా తండ్రి ఇలాగే చేస్తున్నాడని చెప్పిందన్నారు. దీంతో తన బిడ్డతో పాటు ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిందన్నారు. బాలికకు కేజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయగా అత్యాచారం జరిగిందని వైద్యులు స్పష్టంచేశారన్నారు. దీంతో నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ ఉమాకాంత్‌, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.