కూరగాయల సాగుకు ప్రోత్సాహం

కొత్తగూడెం,జూలై 3 (జ‌నంసాక్షి):  రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారులు తెలిపారు.  కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ ద్వారా అమలులో ఉన్న బిందు సేద్య రాయితీలు, పండ్ల తోటల రాయితీలను రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు లైసెన్స్‌ పొందిన నర్సరీల ద్వారా మాత్రమే ప్రోట్రేస్‌లలో పెంచిన మిరప, ఇతర నారును వాడాలని, బహిర్గతంగా నేలపై పెంచే నారును రైతులు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఆయా గ్రామాల్లో సాగులో ఉన్న బెండ, బీర, కాకర, సొరకాయల సాగును పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. నాటేందుకు సిద్దంగా ఉన్న టమాట, వంగ నార్లను పరిశీలించి ఆధునిక సాంకేతిక పద్ధతులైన నారును ప్రోట్రేస్‌, షేడ్‌నైట్స్‌లో పెంచడం, ఎత్తైన మడులు, మల్చింగ్‌, బిందు సేద్యం పద్ధతులను పాటించాలన్నారు.