కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం

ఆపై వీడియో చిత్రీకరణ..బెదిరింపులు

పోలీసులకు ఫిర్యాదుతో దొంగనాయాళ్ల అరెస్ట్‌

విజయవాడ,జూన్‌30(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నిందితులు కృష్ణవంశీ, శివారెడ్డి, దొడ్ల ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు. అత్యాచారానికి సంబంధించిన చిత్రాలను సోషల్‌ విూడియాలో పెట్టి అమ్మాయిని వేధించడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందిన బాధితురాలిని ఆమె స్నేహితులే నమ్మించి మోసం చేశారు. బర్త్‌డే పార్టీ అంటూ పిలిచి మత్తు పదార్థం కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2017 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న విజయవాడకు చెందిన తోటి విద్యార్థి టీ వంశీకృష్ణ, సీనియర్‌ విద్యార్థి శివారెడ్డిలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువకులిద్దరూ ఆగిరిపల్లిలో రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బర్త్‌డే పార్టీ ఉందంటూ ఆమెను ఓ రోజు వారిద్దరు తమ గదికి పిలిచారు. మత్తుపదార్థం కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆమెతో తాగించి, అత్యాచారం జరిపారు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. విషయాన్ని బయటకు చెబితే ఆ వీడియోను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కానీ, వారిద్దరు మాత్రం ఊరుకోలేదు. ఆ వీడియోను సోషల్‌ విూడియాలో పోస్టు చేశారు. తమ ముఖాలు కనిపించకుండా బ్లర్‌ చేసి.. ఆమె ముఖం ఒక్కటే కనిపించేలా చేసి వీడియోను తమ స్నేహితుల మొబైళ్లకు పంపించారు. ఆ వీడియోను చూసిన బొద్దనపల్లి గ్రామానికి చెందిన దొడ్ల ప్రవీణ్‌.. ఆమెకు ఫోన్‌ చేసి, బెదిరించాడు. రూ. పది లక్షలు ఇస్తే సరే, లేదంటే ఆ వీడియోను బయట పెడతానని బేరం పెట్టాడు. కొద్ది కాలం ప్రవీణ్‌ వేధింపులను బాధితురాలు భరించింది. అయినా, అతడు మరింతగా రెచ్చిపోతుండటంతో, చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పేసింది. వారు ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి గత మే నెలలో తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిపిన విద్యార్థులనుయాజమాన్యం పిలిపించి మందలించింది. బాధితురాలి కుటుంబానికి వారితో క్షమాపణ చెప్పించింది. ఇక పై ఆ యువతి జోలికి వెళ్ళబోమని, లిఖితపూర్వక హావిూ తీసుకుని, ఆ వీడియోను డిలిట్‌ చేయించింది.సమస్య అక్కడితో తీరిపోయిందని బాధితురాలి కుటుంబం ఊరట చెందింది. తమ కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని, ఆ ప్రయత్నాల్లో పడింది. ఇంతలోనే.. కాలేజీ యాజమాన్యం ముందు డిలిట్‌ చేసినట్టు కనిపించిన వీడియో దృశ్యాలు పది రోజులక్రితం తిరిగి సోషల్‌విూడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిని చూసి నివ్వెరపోయిన బాధితురాలి తండ్రి ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిన ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.