కృష్ణా గోదావరిలో మా వాటా తేల్చండి
– ఉమాభారతికి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్,జూన్ 1(జనంసాక్షి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని సిఎం కెసిఆర్ కంద్రమంత్రి ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను పంచడం సరికాదని ఆయన తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు జరపాలని ట్రిబ్యునల్‌ను కోరామని లేఖలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య పంచాయతీగా చూడడం సరికాదని ఉమాభారతికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ తెలిపారు.కృష్ణా బోర్డుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరా, కాలువల నిర్వహణ బాధ్యత మాత్రమేరాష్టాల్ర మధ్య నీటివాటా అంశాలు కృష్ణా బోర్డు పరిధిలోకి రావని ఆయన అన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చెల్లదని ఉమాభారతికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముసాయిదా నోటిఫికేషన్ రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా లేదని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర వాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని.. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రయోజనలకు భంగం కలుగుతుందనికేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బంగారు తెలంగాణకు రాజకీయ పునరేకీకరణ అవసరమన్నారు. అందరం కలిసి పని చేసి అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం ఒకే గూటికి వస్తున్నారని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రముఖపాత్ర పోషించాలని వచ్చిన మల్లారెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగా వచ్చిన మిత్రులను కూడా కలుపుకుపోవాలని సూచించారు. అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలని పిలపునిచ్చారు. గురువారం జరగబోయే రాష్ట్ర అవతరణ వేడుకలకు పరేడ్ గ్రౌండ్‌కు భారీగా తరలిరావాలని చెప్పారు. వంద శాతం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.