కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కార్‌ ఏం చేసింది

సుస్థిర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ను గెలిపించండి
ఎన్నికల సభలో సోనియా
బెంగళూర్‌, మే 2 (జనంసాక్షి) :
కేంద్రం పంపిన నిధులను కర్ణాటక సర్కారు ఏం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశ్నించారు. ఆమె గురువారం బెంగళూర్‌లో నిర్వహిం చిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలు దక్కాల్సిన విలువైన ఖనిజ సంపద కొందరికే దోచిపెట్టిందని అన్నారు. కేంద్రం పంపిన నిధులతో అభివృద్ధి పనులు చేసి అది తామే చేసినట్టుగా స్థానిక బీజేపీ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో  ప్రజలు అన్ని రంగాల్లో నష్టపోయారని, అవినీతి పేట్రేగిపోయిందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఫోజు కొడుతూ కర్ణాటక అవినీతిని మాత్రం సమర్థిస్తోందని అన్నారు. కేవలం ఐదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన దుస్థితి ఆ పార్టీకి పట్టిందని అన్నారు. సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పలు పథకాలను వివరించారు.