కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు నిరసనసెగ


విశాఖలో దిష్టిబొమ్మ దగ్దం..గో బ్యాక్‌ అంటూ నినాదాలు
విశాఖపట్టణం,ఆగస్ట్‌7(జనంసాక్షి): కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రాక సందర్భంగా నిరసనలు మిన్నంటాయి. నిర్మలా సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ.. శనివారం విశాఖలో వామపక్ష, కార్మిక సంఘాల నిరసనలు భగ్గుమన్నాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకూడదని.. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ… అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేతలు ఆందోళన నిర్వహించారు. నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మను దగ్థం చేసి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో
నాయకులు బి.గంగారావు, జగన్‌, నాయుడు కుమార్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఉక్కు కార్మికుల నిరసన సెగ తగిలింది.
స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ వద్దు అంటూ.. ఆమెకు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన వామపక్ష, కార్మిక నేతలను పోలీసులు అడ్డుకొని బలవంతపు అరెస్టులు చేశారు. కార్మిక నేతల అరెస్టులను సిపిఎం, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిరచాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినటువంటి వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.