కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం
నిజామాబాద్, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కోరారు. సోమవారం స్థానిక బస్టాండ్ ఎదుట యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవి, సుశీల్‌కుమార్ షిండే, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు , పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాంగోపాలరావు, మధుయాష్కీగౌడ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిరంతరం మోసం చేస్తోందని విమర్శించారు. ఆంధ్ర ప్రాంత నాయకులకంటే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులే తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. జనవరి 28లోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకపోతే తానే మొదట రాజీనామా చేస్తానని ప్రకటించిన మధుయాష్కీగౌడ్ యుటర్న్ తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎంపిగా కొనసాగే నైతిక హక్కు మధుయాష్కీకి లేదని ఆయన అన్నారు. తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌యాదవ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.